Saturday, 8 May 2021

వాల్మీకి రామాయణం - 26వ దినము, కిష్కింధకాండ

 



ఆలా సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషంగా కాలం గడపసాగాడు.

బాల ఇంద్రగోప్తా అంతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన |
గాత్ర అనుపృక్తేన శుక ప్రభేణ నారీ ఇవ లాక్ష ఉక్షిత కంబలేన ||

ఆ వర్షాకాలాన్నీ చూసి రాముడన్నాడు " ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది. అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆకాశంలో వెళుతున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథాలలా ఉన్నాయి, మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాలలా ఉన్నాయి, ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణా. ఎప్పుడెప్పుడు రావణాసురిడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది.


మార్గ అనుగః శైల వన అనుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య |  
యుద్ధ అభికామః ప్రతినాద శంకీ మత్తో గజేంద్రః ప్రతిసంనివృత్తః ||

ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉంది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ' ఆహా, ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తుంది, దాని మదం అణిచేస్తాను ' అనుకొని, తన తొండాన్ని పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళి ఆ మేఘం శబ్దం చేసింది. ' ఓహొ, మేఘమా ఉరుముతున్నది. మరొక మదగజం కాదన్నమాట ' అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి, తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలీదు, కాని ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టాయో, ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.

నిద్రా శనైః కేశవం అభ్యుపైతి ద్రుతం నదీ సాగరం అభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనం అభ్యుపైతి కాంతా స కామా ప్రియం అభ్యుపైతి ||

నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది, నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి, పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోంది. ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు " అని రాముడు అన్నాడు.

అలా వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి " సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రులయందు పరాకుగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దెగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు, ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది.


నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు, నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ' నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు ' అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దెగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే " అన్నాడు.

హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, 15 రోజుల తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్కమాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి " పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి, నేల మీద ఉండే బురద ఇంకిపోయింది, చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు, శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడం లేదు.


లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడంలేదో, ఈ గుహ దెగ్గరికి ఎందుకు రావడంలేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా.
ప్రియా విహీనే దుఃఖ ఆర్తే హృత రాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||
నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైన దుఖంతో ఉన్నాను, ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దెగ్గర ఏముంది లక్ష్మణా, గుహలో పడుకొని ఉన్నాను కదా, అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదయ్యా. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, ఇవ్వాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు, నేను ఇప్పుడు అనాథని, రావణుడేమో నన్ను అవమానించాడు, దీనుడిని, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను, నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను, అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడం లేదు.

ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు, ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.

అర్థినాం ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణాం |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||
ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో, వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో, వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని, తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళి కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు, రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. అందుకని, లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ' మా అన్నగారు కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా ' అని అడుగు.


న స సంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః ||

అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ' వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతె నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ' అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు " అని రాముడన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు " ఎందుకన్నయ్యా అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. అన్నయ్య! ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచేస్తోంది, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను " అన్నాడు.


ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని, చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న " అని చెప్పాడు.

రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ' నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ' అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు, అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు, లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానర కాంతలతో విశేషమైన మధుపానం చేసి, హారములన్నీ చెదిరిపోయి, కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో " నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ' రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు '. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి, ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు " అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడుప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు. 


కాని అప్పటికే లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి " ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు " అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు " నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి, నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే, వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది. స్నేహం చెయ్యడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయం చెయ్యకపోవడం నా తప్పే " అన్నాడు.

సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనం ||





అప్పుడు హనుమంతుడు అన్నాడు " సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు, ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. కాని రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కాని నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని, నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ' రాముడు నన్ను ఇంతమాట అంటాడ ' అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే, అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోమాకు " అన్నాడు.


బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు, సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.


అప్పుడు సుగ్రీవుడు తారతో " తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది, ఆమె ఒంటిమీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కాని, స్త్రీ జోలికి వెళ్ళడం కాని ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది, పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి, ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.


స తాం సమీక్ష్య ఏవ హరి ఈశ పత్నీం తస్థౌ ఉదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖో ఆభూత్ మనుజేంద్ర పుత్రః స్త్రీ సన్నికర్షాత్ వినివృత్త కోపం ||



ఎప్పుడైతే తన దెగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకి దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమి వంక చూస్తూ, ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు.



........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
.........

No comments:

Post a Comment